తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఉచిత హెల్త్ కార్డ్స్ బహుకరణ

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) అమెరికా మరియు కెనడాలోని తెలంగాణ ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తూ, తెలంగాణ మరియు తెలుగు వారికి ఉచిత సేవలందిస్తున్న మొదటి జాతీయ తెలంగాణ తెలుగు సంఘం. ఈ సంఘం ముఖ్య ఉద్దెశ్యం తెలంగాణ మరియు తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడటమే. అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు తత్వవేత్త డా’ పైళ్ల మల్లారెడ్డి తనలాగా ఆలోచించే మరికొంతమంది సలహాదారులతో ఈ సంఘం స్థాపించారు.
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) అధ్యక్షులు మోహన్ రెడ్డి పట్లోళ్ల ప్రత్యేక దృష్టి సారించి టిటిఎ వివిధ రంగాలలో సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చిన సమయంలో కరోనా తక్షణ సహాయ బృందాన్ని ఏర్పాటు చేసి షుమారు కోటి రూపాయలు విరాళాలు సేకరించి తెలంగాణ మరియు దేశం నలుమూలల సేవలను విస్తరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం తక్షణ సహాయ బృందం ఎంతో కష్టపడ్డప్పటికీ కొన్ని కుటుంబాలలో కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇది ఎంతోమంది తెలంగాణ మరియు మరియు తెలుగు వారిని కలచి వేసింది. ఇదే అంశం ఒకసారి ప్రముఖ కీళ్ల వ్యాధి నిపుణులు డా’ గురువారెడ్డి గారితో, వారిని కలిసినపుడు ప్రాస్తావించారు. అతి ఎక్కువ మరణాలకు కారణం కరోనా ఒక్కటే కాదు అని వారికి వివిధ వ్యాధులు నిక్షిప్తంగా ఉండి కరోనా సోకడంతో అవి బయటకి వచ్చి మనిషి యొక్క వ్యాధినిరోధక శక్తిపై ప్రభావం చూపటం తో చాలా మంది చనిపోయారని చెప్పుకొచ్చారు. వీటిని జయించాలంటే ప్రతి ఆర్నెల్లు లేదా సంవత్సరానికి సాధారణ వ్యాధులకు సంబంధిన పరీక్షలు చేయించుకొని వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉండాలన్నారు.
ఇటువంటి సమస్యలు అమెరికాలో ఉన్న ఎన్నారైలకు భారతదేశంలో ఉన్న వారి తల్లి తండ్రులు మరియు బంధువుల ఆరోగ్యం గురించి ఆలోచించేలా చేసి ఎంతో ఆందోళనకు గురిచేసాయి. అయితే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మరియు ఆర్మ హెల్త్ కేర్ సంస్థలు సంయుక్తంగా టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు ను రూపొందిచేలా చర్యలు తీసుకున్నారు.
ఈ టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు ద్వారా టిటిఎ కుటుంబాలకు మరియు వారి బంధువుల కుటుంబాలకు అత్యవసర మరియు వివిధ సేవలలో ప్రాముఖ్యత లభించేలా దోహదపడుతుంది. ముఖ్యంగా వివిధ రంగాలలో వైద్యనిపుణుల అపాయింట్మెంట్, ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణ, రోగి యొక్క ఆరోగ్య విషయాలు, పత్రాలు, మరియు ఏ రకమైన వైద్యం అందించాలో వివరించి చెప్పే వెసులుబాటు ఉంటుంది. అంతే కాక ఆర్మ హెల్త్ కేర్ నెట్వర్క్ లో సన్ షైన్, కిమ్స్ వంటి మల్టీ స్పెషలిటీ ఆసుపత్రులు ఉన్నాయి కనుక మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేకాక వైద్యంలో రాసిన వివిధ పరీక్షలలో టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు వలన కొంత రాయితీ కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది అని టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు ప్రమోటర్ మరియు సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టరు డా’ గురువా రెడ్డి అన్నారు.
టిటిఎ అధ్యక్షులు డా’ మోహన్ రెడ్డి పట్లోళ్ల మాట్లాడుతూ, ఇంతవరకు విదేశాలలో
ఏ దేశంలో ఏ సంఘం కూడా ఇలాంటి ఒక విధి విధానాలతో కూడిన హెల్త్ కార్డును అందుబాటులోకి తీసుకు రాలేదని, మొట్టమొదటిగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ)ఈ యొక్క చర్యలకు ఉపక్రమించిందని, ఇది నేను అధ్యక్షులుగా ఉండగా జరుగుతుండటం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నానని తెలియజేసారు. అమెరికాలో తెలంగాణ మరియు తెలుగు వారికి టిటిఎ కమ్యూనిటీ సర్వీసెస్ మరియు హెల్ప్ లైన్ నిత్యం అందుబాటులో ఉందని తెలియజేసారు. ఈ టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు వలన ఎన్నారైల తల్లి తండ్రులకు ఒక మంచి భరోసా దొరుకుతుందని, వారి ఆరోగ్య విషయాలు ఆర్మ నెటవర్క్లో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని, ప్రతి చిన్న విషయానికి ఆందోళనతో విమానం ఎక్కాల్సిన పరిస్థితి రాదని, వైద్య నిపుణులతో సంప్రదించి అవసరమైన సందర్భాలలో ఇండియాకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోటానికి వీలుంటుందని తెలియజేసారు.
ఈ సందర్భముగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) తరపున టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్న డా’ నరసింహరెడ్డి దొంతిరెడ్డి, టిటిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు వెంకట్ గడ్డం మరియు టిటిఎ కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ శివారెడ్డి కొల్లా, ఆర్మ హెల్త్ కేర్ నెట్వర్క్ మరియు టిటిఎ-ఆప్యాయ హెల్త్ కార్డు కు భాగస్వామ్యులుగా ఉన్న ప్రతిఒక్కరికి ధన్యవాధాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి ఎంతోమంది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మరియు ఆర్మ హెల్త్ కేర్ నెట్వర్క్ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా డా’ మోహన్ రెడ్డి పట్లోళ్ల, డా’ గురువారెడ్డి, డా’ నాగరాజు బత్తిన, వెంకట్ గడ్డం, వెంకట్ ఎక్క, హరిందర్ తాళ్లపల్లి… తదితరులు పాల్గొన్నారు.
