Sridevi Movies unveils a Magnificent sets for Samantha’s ‘Yashoda’

రూ. 3 కోట్ల భారీ సెట్స్‌లో సమంత – శ్రీదేవి మూవీస్ ‘యశోద’ షూటింగ్

సమంత ప్రధాన పాత్రలో  రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో సెట్స్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్స్‌లో కథలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన తారగా మేం నిర్మిస్తున్న ‘యశోద’ సినిమాలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఓ ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హోటల్స్ చూశాం. అయితే… 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. అందుకని, సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించాం. నాన‌క్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ… సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోంది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం.  పతాక సన్నివేశాలు కొడైకెనాల్‌లో ప్లాన్ చేశాం. జనవరిలో సంక్రాంతికి ముందు ఒక షెడ్యూల్, డిసెంబర్ 6 నుంచి క్రిస్మస్ వరకూ తొలి షెడ్యూల్ చేశాం. ఏప్రిల్ నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తి చేయాలనుకుంటున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం” అని చెప్పారు.

‘ఒక్కడు’లో ఛార్మినార్ సెట్ వేసినది అశోకే. ఆయన ఇంకా పలు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సెట్స్ వేశారు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 150కు పైగా సినిమాలు చేశారు. కథకు తగ్గట్టు ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన సెట్స్ వేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అశోక్ పనితనానికి, కళానైపుణ్యానికి ‘యశోద’ సెట్స్ తార్కాణంగా నిలుస్తాయని చిత్రబృందం తెలియజేసింది.  

సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. 

ఈ చిత్రానికి  సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *