Monday, April 15, 2024
spot_img

Nominated Telugu artists for Padma Shri Awards

Nominated Telugu artists for Padma Shri Awards

పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి అభినందనలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారగ్రహీతల్లో స్థానం పొందిన తెలుగువారికి నా తరఫున జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు విస్తృత ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ ఆవిష్కరించి ప్రపంచానికి అందించి… మన దేశ పరిజ్ఞాన విశిష్టతను చాటిన భారత్ బయోటెక్ సంస్థ కృషికిగాను ఆ సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం ముదావహం. సాఫ్ట్ వేర్ రంగంలో తెలుగువారి ఖ్యాతి చాటిన మైక్రోసాఫ్ట్ సి.ఈ.ఓ. శ్రీ సత్య నాదెళ్ళతోపాటు గూగుల్ సీఈవో, మన దక్షిణ భారతీయుడు శ్రీ సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ శ్రీ సైరస్ పూనావాలా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేయడం సముచితం. దేశ రక్షణ కోసం విశిష్ట సేవలందించి ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ శ్రీ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించి ఆయన సేవలకు సార్థకత కలిగించారు.
తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మిక అంశాలపై సాధికారత కలిగిన ప్రవచనకర్త, అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్ లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డా.సుంకర ఆదినారాయణరావు, అరుదైన కిన్నెర వాయిద్యంపై సంగీతం పలికించే శ్రీ దర్శనం మొగులయ్య, ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి పద్మజా రెడ్డి, కళాకారులు శ్రీ రామచంద్రయ్య, ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గార్లను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ గారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా ప్రచారానికి దూరంగా కళా సేవ చేసేవారిని, సంఘ సేవకులను శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తిస్తుంది అని మరోసారి వెల్లడైంది.

(పవన్ కళ్యాణ్)

మరో తెలంగాణ గిరిజనునికి అత్యున్నత పద్మశ్రీ గౌరవం

జానపద కళాకారులు రామచంద్రయ్య కృషికి తగిన పురస్కారం

గిరిజన జాతికి రామచంద్రయ్య గర్వకారణం

రామచంద్రయ్యకు గిరిజన శాఖ మంత్రిగా హృదయ పూర్వక శుభాకాంక్షలు

పద్మశ్రీ పొందిన తెలంగాణ కళాకారులు కిన్నెర మొగిలయ్య, పద్మజా రెడ్డిలకు శుభాకాంక్షలు

రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

(హైదరాబాద్, పి.ఆర్. ఓ- ఆది, జనవరి 25)

దేశంలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేయడంలో గిరిజనులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని, అత్యున్నత గౌరవ పురస్కారాలు పద్మశ్రీలను సాధిస్తున్నారని… గత ఏడాది గుస్సాడి కనకరాజు పద్మశ్రీ పొందితే…ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ జాబితాలో భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా, మణుగూరుకు చెందిన గిరిజన జానపద (డోలి, ఓకల్) కళాకారుడు రామచంద్రయ్య ఉండడం తెలంగాణకు, గిరిజన జాతికి గర్వకారణమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు.

రామచంద్రయ్యకు గిరిజన శాఖ మంత్రిగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కళలకు గొప్ప సేవ చేసి పద్మశ్రీ పొందిన పద్మజా రెడ్డి, కిన్నెర మొగిలయ్యలకి శుభాకాంక్షలు తెలిపారు.

గిరిజనులు, మహిళలు మన రాష్ట్రం తరపున పద్మశ్రీ వంటి గొప్ప పురస్కారాన్ని సాధించడం రాష్ట్ర మహిళలు, గిరిజనులకు గొప్ప గౌరవం, స్ఫూర్తిదాయకం అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కళలు విలసిల్లుతున్నాయని, మహిళలు, అట్టడుగు వర్గాల కళాకారులు కూడా అత్యున్నత గౌరవాలను పొందుతున్నారు అని చెప్పడానికి ఈ పద్మశ్రీ పురస్కారాలు నిదర్శనం అన్నారు.

సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ రాష్ట్రం అంతరించి పోతున్న చేతి వృత్తులు, కళలకు జీవం పోసి కళాకారులను వెలుగులోకి తీసుకొస్తుంది అని తెలిపారు.

పద్మశ్రీ పొందిన గిరిజన కళాకారుడు రామచంద్రయ్యకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకట రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, పద్మశ్రీ కి ఎంపికైన శ్రీ గరికిపాటి నరసింహారావు, కీర్తిశేషులు శ్రీ గోసవీడు షేక్ హసన్, శ్రీ దర్శనం మొగిలయ్య, శ్రీ రామ చంద్రయ్య, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, శ్రీమతి పద్మజ రెడ్డిలకు న్యాయమూర్తి శ్రీరమణ పేరు పేరునా అభినందనలు తెలిపారు. తెలుగుజాతి కీర్తి పతాకను కోవిడ్ టీకా ఆవిష్కరణతో విశ్వ వినువీథుల్లో ఎగురవేసిన ఎల్లా దంపతులు, అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న శ్రీ నాదెళ్ల సత్యనారాయణ పద్మభూషణ్ కు ఎంపికవడం ముదావహమన్నారు శ్రీ రమణ. చక్కని తెలుగు వాచకంతో, అర్థవంతమైన ప్రవచనాలతో తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన శ్రీ గరికిపాటి నరసింహారావు గారు, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ఇతర పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తెలుగు జాతికి గర్వకారణమని జస్టిస్ రమణ కొనియాడారు.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles