“ALLANTHA DOORANA” teaser unveiled by comedian Ali

హాస్య నటుడు అలీ ఆవిష్కరించిన “అల్లంత దూరాన” టీజర్

“అల్లంత దూరాన” చిత్రం చక్కటి ప్రేమకథతో విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ప్రముఖ హాస్య నటుడు అలీ పేర్కొన్నారు. విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్ ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, కధకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేరళలో కొన్ని సీన్స్ ,పాటలు తీసేటప్పుడు ఎత్తైన కొండల అంచులపైకి ఎక్కి టీమ్ చాలా రిస్క్ చేసింది. ఇందులో నటించిన నటుడిగా తప్పకుండా ఇదో మంచి చిత్రమవుతుందని చెప్పగలను” అని అన్నారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రకథతో పాటు విజువల్స్, మ్యూజిక్ వంటివన్నీ చాలా బావున్నాయని పేర్కొనగా, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఈ చిత్ర హీరోహీరోయిన్లు తమతమ పాత్రలలో చక్కగా ఒదిగిపోయినట్లు అనిపిస్తోంది. కథ, కథనాలకు ప్రాధాన్యమిస్తూ తీసిన ఏ చిత్రమైనా విజయవంతమవుతుంది. ఇక పాటలు సందర్భానుసారంగా అమరాయంటే, ఇక ఆ చిత్రానికి తిరుగుండదు. ఆ కోవలోనే ఈ చిత్రం అలరింపజేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు డి.ఎస్.రావు, బెక్కం వేణుగోపాలరావు, శ్రీనివాస్, నటుడు కాశీ విశ్వనాద్ తదితరులు మాట్లాడుతూ, హీరో విశ్వ కార్తికేయను బాల నటుడిగా ఉన్నప్పట్నుంచి పరిశ్రమలో చూస్తూనే ఉన్నామని, అతనిలోని ప్రతిభాపాటవాలను హీరో కోణంలో కూడా వెలికితీసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.

చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, స్క్రిప్ట్ పరంగా పేపర్ మీద ఏదైతే పెట్టానో, దానిని నమ్మి, నిర్మాత చంద్రమోహన్ రెడ్డి గారు, సినిమాకు కావాల్సిన ఆర్టిస్టులు భాగ్యరాజా, ఆమని, తులసి వంటి ఆర్టిస్టులను సమకూర్చడమే కాదు, మంచి సాంకేతిక నిపుణలను ఎంపిక చేసుకునే విషయంలో కూడా నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దానివల్లే నేను అనుకున్నవిధంగా విజువల్ ఫీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. ప్రతీ సన్నివేశం, ప్రతీ పాట ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తుంది’ అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, మంచి కథ, కథనాలే ఈ చిత్రాన్ని తీసేందుకు నాకు స్ఫూర్తి కలిగించాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందించిన ఈ చిత్రం రెండు బాషలలో మా అంచనాలను నిలబెడుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, మోషన్ పోస్టర్లకు ఎనలేని స్పందన లభించిందని అన్నారు.

గీత రచయిత రాంబాబు మాట్లాడుతూ, ఇందులోని ఐదు పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయని, అన్ని పాటలను తానే రాశానని చెప్పారు.

హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, “నేను ఎన్ని సినిమాలను చేసినా, ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇందులోని పాత్ర నన్ను అంతలా ఆకట్టుకుందని అన్నారు. విభిన్న కోణాలలో సాగే పాత్రలో మంచి నటనను కనబరిచే అవకాశం లభించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.

హీరోయిన్ హ్రితిక శ్రీనివాసన్ మాట్లాడుతూ, తెలుగులో నా మొదటి చిత్రమిది. ఇలాంటి ఫీల్ గుడ్ చిత్రంలో నటించే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. మా ఆంటీ ఆమనిలా మంచి నటిని అనిపించుకోవాలని ఉంది అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం కెమెరామెన్ కళ్యాణ్ బోర్లగాడ్డ, ఎడిటర్ :శివకిరణ్ తదితరులతో పాటు ఐపీఎల్ దర్శక, నిర్మాతలు విజయ్, శ్రీనివాస్, వ్యాపారవేత్త రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *